China: ఆమె మహిళ కాదు... కాలి గాయం కారణంగా వెల్లడైన వాస్తవం!

  • చైనాలో ఘటన
  • పాతికేళ్ల తర్వాత ఆమె మహిళ కాదని తేలిన వైనం
  • పింగ్ పింగ్ అనే యువతికి పెళ్లి చేసిన తల్లిదండ్రులు
  • ఇటీవల కాలికి గాయంతో ఆసుపత్రిపాలు
  • ఆమెకు గర్భాశయం లేదని తేల్చిన వైద్యులు
  • జన్యుపరంగా ఆమె పురుషుడని నిర్ధారణ
China woman knows that she is not woman

చైనాలో ఓ మహిళ జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. జెజియాంగ్ ప్రావిన్స్ కు చెందిన పింగ్ పింగ్ తాను మహిళను కాదన్న నిజం పాతికేళ్ల తర్వాత వెల్లడైంది. పింగ్ పింగ్ పెళ్లికి ముందు ఆమె రుతుస్రావ సమస్యలు ఎదుర్కొంది. డాక్టర్లకు చూపిస్తే శారీరక ఎదుగుదల నిదానంగా జరుగుతోందని, కొంత కాలం తర్వాత ఆ సమస్య సర్దుకుంటుందని చెప్పారు. దాంతో యుక్తవయస్సుకు రాగానే ఓ యువకుడితో పెళ్లి చేశారు.

అయితే, ఆమె సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా గర్భం దాల్చలేదు. ఇటీవల ఆమె కాలికి దెబ్బ తగలడంతో ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఎక్స్ రే తీయగా ఎముకలు వయసుకు తగిన విధంగా లేవని గుర్తించారు. దాంతో మరి కొన్ని పరీక్షలు చేయగా నివ్వెరపోయే నిజం వెల్లడైంది. ఆమెకు గర్భాశయం కానీ, అండాశయం కానీ లేవని రిపోర్టుల్లో స్పష్టమైంది.

పింగ్ పింగ్ లో సరిగా అభివృద్ధి చెందని రీతిలో స్త్రీ, పురుష జననావయవాలు కనిపించాయి. ఆమె పైకి మహిళగా కనిపిస్తున్నా, జన్యుపరంగా మాత్రం పురుషుడేనని వైద్య నిపుణులు నిర్ధారించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రక్తసంబంధీకులే కావడంతో ఈ తరహా జన్యులోపం వచ్చి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. మనదేశంలోనూ ఇలాంటి జన్యులోపాలు వస్తాయన్న కారణంగానే మేనరికాలు వద్దని చెబుతుంటారు.

More Telugu News