Tear Glands: డచ్ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి... ప్రయోగశాలలో మానవ కన్నీటి గ్రంథుల అభివృద్ధి

  • కన్నీటిని స్రవించే గ్రంథులు
  • మెదడు స్పందనల ఆధారంగా కన్నీరు విడుదల
  • తొలిసారిగా మానవదేహం వెలుపల కన్నీటి గ్రంథుల తయారీ
  • షోగ్రెన్ సిండ్రోమ్ బాధితులకు ఉపయుక్తంగా ఉంటుందన్న పరిశోధకులు
Dutch scientists made tear glands in lab

మానవుడు భావోద్వేగాలకు లోనైనప్పుడు మెదడు నుంచి కళ్లలో ఉండే కన్నీటి గ్రంథులు సంకేతాలు అందుకుంటాయి. ఆ గ్రంథులు స్పందించడం వల్లే మనకు కన్నీళ్లు వస్తుంటాయి. అయితే, నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు ఆ కన్నీటి గ్రంథులను ప్రయోగశాలలో రూపొందించి సంచలనం సృష్టించారు. పైగా ఆ గ్రంథులు అచ్చం మనిషి తరహాలోనే కన్నీరు విడుదల చేస్తుండడం ఓ అద్భుతం అని చెప్పాలి.

వాస్తవానికి కన్నీరు అనేది కళ్లను శుభ్రం చేసుకునేందుకు శరీరం నిర్దేశించిన యంత్రాంగాల్లో ఒకటి. అయితే, కన్నీటి గ్రంథుల్లోని ఏ కణజాలం కన్నీటి ఉత్పత్తిలో కీలకంగా ఉందన్న విషయయం తెలుసుకునేందుకు డచ్ శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేపట్టారు. ఈ క్రమంలో వారు కన్నీటి గ్రంథులను మానవదేహం వెలుపల అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

కంటి పైభాగంలో ఉండే కుహరంలో కన్నీటి గ్రంథులకు సంబంధించి ఓ రహస్య ద్రవం ఉంటుందని గుర్తించారు. ఇది నీరు, ప్రొటీన్లు, లిపిడ్లు, ఎలక్ట్రోలైట్లతో తయారైన ద్రవం అని తెలుసుకున్నారు. అయితే కొందరిలో స్పందనలు ఉన్నప్పటికీ కన్నీరు రాకపోవడానికి షోగ్రెన్ సిండ్రోమ్ కారణమని పరిశోధకులు పేర్కొన్నారు. వీరిలో కన్నీటి గ్రంథులు సరిగా పనిచేయవని, పైగా వారిలో లాలాజలం ఉత్పత్తి కూడా కుంటుపడుతుందని వివరించారు.

ఇలాంటి కేసుల్లో కొన్నిసార్లు కళ్లు పొడిగా మారిపోయి, దీర్ఘకాలంలో అంధత్వానికి దారితీస్తుందని తెలిపారు. ఇలాంటి వ్యక్తులకు తాము కృత్రిమంగా తయారుచేసిన కన్నీటి గ్రంథులు ఎంతగానో ఉపకరిస్తాయని, వారు అంధత్వం బారినపడకుండా రక్షిస్తాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న యోరిక్ పోస్ట్ వెల్లడించారు.

More Telugu News