Tirupati: తిరుపతి, నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల

By election schedule for Tirupati and Nagarjuna Sagar
  • ఏప్రిల్ 17న రెండు స్థానాల్లో పోలింగ్
  • మే 2న ఓట్ల లెక్కింపు
  • రెండు ప్రాంతాల్లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
ఏపీలోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గం, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉపఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈసీ తెలిపింది. ఏప్రిల్ 17న ఈ రెండు స్థానాలకు ఉపఎన్నిక జరుగుతుందని ఈసీ ప్రకటించింది.

నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు విధించింది. 31న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని తెలిపింది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. ఉపఎన్నిల షెడ్యూల్ ను ప్రకటించడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తిరుపతిలో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, నాగార్జునసాగర్ లో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి కారణంగా ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

తిరుపతిలో వైసీపీ, టీడీపీ ఒంటరిగా పోటీ చేయనుండగా... బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మాజీ హోంమంత్రి జానారెడ్డి బరిలోకి దిగడంతో పోటీ ఉత్కంఠభరితంగా మారింది.
Tirupati
Nagarjuna Sagar
By Polls
Schedule

More Telugu News