అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించడంలేదు: నిర్మలా సీతారామన్

16-03-2021 Tue 17:27
  • చర్చనీయాంశంగా మారిన ప్రైవేటీకరణ అంశం
  • నిన్న, ఇవాళ బ్యాంకుల సమ్మె
  • స్పందించిన నిర్మలా సీతారామన్
  • బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామని భరోసా
Nirmala Sitharaman opines on Banks privatisation matter

దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించడం పట్ల బ్యాంకుల యూనియన్లు నిన్న, ఇవాళ సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించడంలేదని స్పష్టం చేశారు. ప్రైవేటీకరించే బ్యాంకుల ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యంత భద్రత కల్పిస్తామని వెల్లడించారు. ఆయా బ్యాంకులను మూసివేయడం జరగదని, ఉద్యోగులను తొలగించబోవడంలేదని వివరించారు. ఆ బ్యాంకుల ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లపై అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటామని నిర్మల పేర్కొన్నారు.

"ప్రభుత్వం ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్నదానిపై ఇప్పటికే పాలసీని ప్రకటించాం. నాలుగు రంగాల్లో ప్రభుత్వం వాటాలు ఉండాలని నిర్ణయించాం. అందులో ఆర్థిక రంగం కూడా ఉంది. బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరించబోవడంలేదు" అని వివరించారు. ఇక, ప్రైవేటీకరణ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేయడంపైనా నిర్మల బదులిచ్చారు. ఇలా ఒకట్రెండు లైన్లు విసిరికొట్టడంకంటే తీవ్రస్థాయిలో చర్చించాలని కోరుకుంటున్నానని రాహుల్ కు స్పష్టం చేశారు.