మీ ఇద్దరి నైజాన్ని రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకున్నారు: జగన్, చంద్రబాబుపై సునీల్ దేవధర్ వ్యాఖ్యలు

16-03-2021 Tue 16:28
  • ఇద్దరూ ఇద్దరేనంటూ వ్యాఖ్యలు
  • సీఎం హోదాలో అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణ
  • ప్రజల సొమ్మును స్వలాభం కోసం వాడుకున్నారని వెల్లడి
  • ప్రజలు ఇద్దరినీ పాతాళానికి తొక్కేస్తారంటూ ట్వీట్
Sunil Deodhar slams Jagan and Chandrababu

ఏపీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబులపై రాష్ట్ర బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ స్పందించారు. ఇద్దరూ ఇద్దరేనని, ముఖ్యమంత్రి హోదాలో అధికార బలాన్ని, ప్రజల సొమ్మును స్వలాభం కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. జగన్, చంద్రబాబులను ప్రజలు పాతాళానికి తొక్కి, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ బీజేపీ-జనసేన కూటమిని అందలం ఎక్కించే రోజు త్వరలోనే వస్తుందని స్పష్టం చేశారు.

అంతేకాదు, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నంద్యాల ఉప ఎన్నిక జరగ్గా, అందులో టీడీపీ నెగ్గినప్పుడు విపక్షనేత హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా సునీల్ దేవధర్ పంచుకున్నారు. ఆ వీడియోలో జగన్... నాటి సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలిచాడని, ఇలా గెలిచినదాన్ని గెలుపు అనుకుంటే అది చంద్రబాబు భ్రమ అని వ్యాఖ్యానించారు. నాటి ఈ వ్యాఖ్యలను ఇప్పటి సీఎం జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలని సునీల్ దేవధర్ సూచించారు.