Atchannaidu: 700 ఎకరాల అసైన్డ్ భూములను 30 ఏళ్ల పాటు వైయస్ కుటుంబం అనుభవించింది: అచ్చెన్నాయుడు

YS Family enjoyed 700 acres assigned land for  30 years says Atchannaidu
  • చంద్రబాబుకు నోటీసులు కక్ష సాధింపుల్లో భాగమే 
  • అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది
  • ఆర్కే ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారు? 
  • రైతుల ఆమోదంతోనే టీడీపీ ప్రభుత్వం భూములు తీసుకుందన్న అచ్చెన్న  
అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

కక్ష సాధింపుల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని అన్నారు. రాజధాని కోసం రైతుల ఆమోదంతోనే అసైన్డ్ భూములను అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డి ఎస్సీనా? లేక ఎస్టీనా? అని ప్రశ్నించారు. ఆర్కే ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారని మండిపడ్డారు. అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు.

అమరావతిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులుకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. 2015లో ల్యాండ్ పూలింగ్ జరిగితే... ఇప్పుడు సీఐడీ కేసులు పెట్టడం ముమ్మాటికీ  కక్ష సాధింపేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికీ తన సొంత ప్రయోజనాల కోసం పేద ప్రజల అసైన్డ్ భూములను వాడుకుంటున్నారని ఆరోపించారు.

ఇడుపులపాయలో 700 ఎకరాల అసైన్డ్ భూములను 30 ఏళ్ల పాటు వైయస్ కుటుంబం అనుభవించిందని... ఆ విషయం బయటకు రావడంతో 610 ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నానని అసెంబ్లీలో వైయస్ రాజశేఖరరెడ్డి చెప్పారని అన్నారు. వాన్ పిక్ కోసం వేలాది ఎకరాల భూములను లాక్కున్నారని... రైతులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. సోలార్ కంపెనీల కోసం అసైన్డ్ భూములను లాక్కోవడానికి జగన్ ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చిన సంగతి నిజమా? కాదా? అని ప్రశ్నించారు.
Atchannaidu
Chandrababu
Telugudesam
CID Notice
Jagan
YSRCP

More Telugu News