అసోంలో ఆ పొత్తుతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది: బీజేపీ ఎద్దేవా

16-03-2021 Tue 10:52
  • అసోంలో 35 శాతం ముస్లిం ఓటు బ్యాంకు
  • అజ్మల్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్
  • రాహుల్ ఉన్నప్పుడు అజ్మల్ ఎందుకని ప్రశ్నిస్తున్న బీజేపీ
BJP questions Congress why you Need Ajmal in Assam

పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. నేతల పదునైన విమర్శలతో ప్రచారపర్వం వేడెక్కుతోంది. అసోంలో బద్రుద్దీన్ అజ్మల్ కు చెందిన ఏఐయూడీఎఫ్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ జతకట్టింది. దీంతో, అజ్మల్ ను చూపుతూ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. అసోం సంప్రదాయాలు ఏమాత్రం లేని అజ్మల్ తో కాంగ్రెస్ ఎలా జతకడుతుందని ప్రశ్నిస్తోంది.

అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ, అజ్మల్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ 50  ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. 80వ దశకం తొలి నాళ్లలో అసోం ప్రజలు కాంగ్రెస్ కు దూరమయ్యారని... ఆ తర్వాత కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడానికి దాదాపు 25 ఏళ్లు పట్టిందని చెప్పారు. హితేశ్వర్ సైకియా, తరుణ్ గొగోయ్ లు కాంగ్రెస్ కు మళ్లీ ప్రాణం పోశారని... అయితే, అజ్మల్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఆ పార్టీ మళ్లీ 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. మీకు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఉన్నప్పుడు అజ్మల్ ఎందుకని ఎద్దేవా చేశారు.

ఈ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. అయితే... అస్సామీ సంప్రదాయాలను పూర్తిగా అలవరుచుకోని అజ్మల్ తో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుందని మాత్రమే తాము ఆ పార్టీని ప్రశ్నిస్తున్నామని శర్మ అన్నారు. అజ్మల్ తో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పారు. ఈ ఎన్నికలు పూర్తిగా అజ్మల్ కు వ్యతిరేకంగానే జరుగుతాయని చెప్పారు.

మరోవైపు, అజ్మల్ ను మతతత్వవాదిగా బీజేపీ ఆరోపిస్తోంది. అసోంలో ముస్లిం ఓటు బ్యాంకు 35 శాతం వరకు ఉంది. దీంతో, ఆ రాష్ట్రంలో అజ్మల్ ను బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది.