మమతా బెనర్జీ నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన సువేందు అధికారి

15-03-2021 Mon 18:04
  • మమతపై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయి
  • అఫిడవిట్ లో ఆ విషయాన్ని ఆమె పేర్కొనలేదు
  • ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేశాను
Suvendu Adhikari raises objection on Mamata Banerjees nomination
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్ పై ఆమె ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. మమతపై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయని... వాటిని అఫిడవిట్ లో ఆమె పేర్కొనలేదని అన్నారు. ఈ విషయమై తాను ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. 2018లో ఐదు ఎఫ్ఐఆర్ లు, సీబీఐ ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని అన్నారు.

ఈ ఎఫ్ఐఆర్ లను తొలగించాలని కోరుతూ ఆమె కలకత్తా హైకోర్టును ఆశ్రయించారని... అయితే ఆమె అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందని చెప్పారు. ఆమెపై ఉన్న కేసులకు సంబంధించి సాక్ష్యాలను కూడా ఈసీకి సమర్పించానని... ఈ అంశంపై ఈసీ సరైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నానని అన్నారు. నిబంధనలు ఎవరికైనా ఒకేలా ఉంటాయని... మోదీకైనా, తనకైనా, మమతకైనా రూల్స్ ఒకేలా ఉంటాయని చెప్పారు.