టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

15-03-2021 Mon 07:18
  • పురుషుల టీ20ల్లో 3 వేల పరుగుల పూర్తి
  • ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా కోహ్లీ 
  • నిన్న ఇంగ్లండ్ తో మ్యాచ్ లో రికార్డు నెలకొల్పిన వైనం
  • కోహ్లీ కంటే ముందు 3 వేల మార్కు చేరిన ఇద్దరు మహిళా క్రికెటర్లు
Kohli sets another world record
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రికార్డులు కొత్త కాదు. తాజాగా ఆయన ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది. పురుషుల అంతర్జాతీయ టీ20 పోటీల్లో 3 వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డు స్థాపించాడు. ఇంగ్లండ్ తో నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. అహ్మదాబాద్ లో జరిగిన ఆ మ్యాచ్ లో కోహ్లీ 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 73 పరుగులు చేశాడు. మొత్తమ్మీద కోహ్లీ 87 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడి 3001 పరుగులతో నెం.1గా నిలిచాడు.

ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే... కోహ్లీ కంటే ముందే ఇద్దరు మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ టీ20ల్లో 3 వేల మార్కును అందుకున్నారు. న్యూజిలాండ్ కు చెంది సుజీ బేట్స్ (3,301), వెస్టిండీస్ క్రీడాకారిణి స్టెఫానీ టేలర్ (3,062) ఈ ఘనత సాధించారు.