Ambati Rambabu: ఇంత బ్రహ్మాండమైన విజయం ఇప్పటివరకు ఏ అధికార పక్షానికి రాలేదు: అంబటి

Ambati Rambabu responds over YSRCP victories in AP Municipal Elections
  • ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం
  • విపక్షాల బేజారు
  • ఫలితాలపై సంతోషం వ్యక్తం చేసిన అంబటి
  • రాష్ట్రంలో నిజమైన హీరో జగన్ అంటూ వ్యాఖ్యలు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుండడం పట్ల ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ అధికార పక్షానికి ఇంతటి బ్రహ్మాండమైన విజయం దక్కలేదని, ఇంత ఘోరపరాజయం ఏ ప్రతిపక్షానికి రాలేదని అన్నారు. రాష్ట్రంలో నిజమైన హీరో జగన్ అని ప్రజలు నిరూపించారని, 21 నెలల సీఎం జగన్ పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని వెల్లడించారు. నగర, పట్టణ ప్రాంతాల్లో తనకేదో బలముందని భావించిన చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టే ఎత్తుగడలకు పాల్పడ్డాడని, అయితే ప్రజలు సీఎం జగన్ పక్షానే నిలిచారనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అంబటి పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో చంద్రబాబు, లోకేశ్ ఎక్కడికి వెళ్లారు?... హైదరాబాదులో పాచి పనులు చేసుకోవడానికి వెళ్లారా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఏకగ్రీవాలు అయితే విమర్శించారని, ఏకగ్రీవాలు కాని చోట కూడా అదే రీతిలో ఫలితాలు వస్తున్నాయని అన్నారు. చంద్రబాబు సొంత పుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఏమైపోయారంటూ ఎద్దేవా చేశారు.

అమరావతికి ఈ ఎన్నికలు రిఫరెండం అని చంద్రబాబు అన్నాడని, కానీ ప్రజలు తమ అభిప్రాయం ఏంటో ఓటుతో స్పష్టంగా చెప్పారని అంబటి పేర్కొన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయాలు చవిచూసిన దరిమిలా, ఏపీలో ఇక ప్రతిపక్షమే లేదన్నది స్పష్టమైందని వ్యాఖ్యానించారు.
Ambati Rambabu
YSRCP
Municipal Elections
Jagan
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News