Antibodies: వ్యాక్సిన్ యాంటీబాడీలు కరోనా వేరియంట్లపై చూపే ప్రభావం తక్కువే: తాజా అధ్యయనంలో వెల్లడి

  • ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూస్తున్న కరోనా కొత్త రకాలు
  • యాంటీబాడీలు కరోనా రకాలను గుర్తించలేవన్న పరిశోధకులు
  • జర్నల్ సెల్ మ్యాగజైన్ లో ప్రచురితమైన అధ్యయనం
  • కొత్త వ్యాక్సిన్లు రూపొందించాలన్న పరిశోధకులు
Antibodies effect less on corona variants as per new study

కరోనా నివారణ కోసం వ్యాక్సిన్లు అందించే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కొనసాగుతున్నాయి. ఓవైపు వ్యాక్సినేషన్ జరుగుతుండగా, మరోవైపు కరోనా కొత్త రకాల వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జర్నల్ సెల్ మ్యాగజైన్ లో ప్రచురితమైన ఓ కొత్త అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఇచ్చినప్పుడు మనిషి శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీబాడీలు కరోనా వేరియంట్లపై చాలా తక్కువ ప్రభావం చూపుతున్నాయని ఆ అధ్యయనంలో వెల్లడించారు. కరోనా కొత్త రకాల ప్రభావాన్ని తగ్గించడంలో ఆ యాంటీబాడీల పనితీరు అంతంతమాత్రమేనని తెలిపారు.

కరోనా వైరస్ కణాలను గట్టిగా అతుక్కుని, వాటిని మానవ కణాల్లోకి చొచ్చుకుని పోకుండా చేయడమే యాంటీబాడీల పని అని, ఆ విధంగానే కరోనా ఇన్ఫెక్షన్ నివారణ జరుగుతుందని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన వైద్యనిపుణుడు అలెజాండ్రో బలాస్, ఇతర పరిశోధకులు వెల్లడించారు. అయితే, కరోనా యాంటీబాడీల రూపు, కరోనా వైరస్ కణాల రూపు ఒకేలా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమని, తాళం, తాళంచెవి ఒకదానికొకటి ఎలా సరిపోతాయో, ఇది కూడా అలాంటిదేనని వారు వివరించారు.

ఒకవేళ వైరస్ రూపంలో మార్పులు ఉంటే మాత్రం యాంటీబాడీలు పనిచేయవని విశదీకరించారు. మానవ కణాల్లోకి చొరబడే కరోనా స్పైక్ ప్రొటీన్ ను గుర్తించడంలో యాంటీబాడీలు విఫలమవుతాయని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో మొట్టమొదట వెలుగుచూసిన కరోనా వేరియంట్ యాంటీబాడీల నుంచి 40 రెట్ల వరకు అధిక నిరోధకత కలిగి ఉన్నట్టు తాము గుర్తించామని అసిస్టెంట్ ప్రొఫెసర్ అలెజాండ్రో బలాస్ తెలిపారు. బ్రెజిల్, జపాన్ లో వెలుగుచూసిన కరోనా వేరియంట్లు యాంటీబాడీల నుంచి 7 రెట్ల వరకు నిరోధకత కలిగి ఉన్నాయని వివరించారు. వ్యాక్సిన్ సృష్టికర్తలు కరోనా వేరియంట్లను కూడా దృష్టిలో ఉంచుకుని తదుపరి తరం వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.

More Telugu News