DGCA: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి... మాస్కు లేకపోతే విమానం ఎక్కనివ్వద్దని డీజీసీఏ ఆదేశాలు

  • దేశంలో పెరుగుతున్న రోజువారీ కేసులు
  • నూతన మార్గదర్శకాలు జారీ చేసిన డీజీసీఏ
  • విమానంలో మాస్కు తప్పనిసరి అని స్పష్టీకరణ
  • అసలు ఎయిర్ పోర్టులోకే అనుమతించద్దని ఆదేశాలు
DGCA issues new guidelines amidst corona cases hike

గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా కొత్త కేసుల సరళి చూస్తుంటే మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 20 వేల వరకు రోజువారీ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనలు మరింత కఠినతరం చేసింది. మాస్కు లేకుండా వచ్చే ప్రయాణికులను విమానం నుంచి దించేయాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

మాస్కు లేనివారిని ఎయిర్ పోర్టులోకి అనుమతించవద్దని సీఐఎస్ఎఫ్, పోలీసులకు తెలిపింది. విమానాశ్రయంలో ప్రయాణికులు మాస్కులు ధరించేలా చూడాల్సిన బాధ్యత విమానాశ్రయ డైరెక్టర్, టెర్మినల్ మేనేజర్ లదేనని స్పష్టం చేసింది. ప్రయాణికులు కరోనా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే వారిని భద్రతాసిబ్బందికి అప్పగించాలని డీజీసీఏ తన నూతన మార్గదర్శకాల జాబితాలో పేర్కొంది.

ప్రయాణ సమయంలో ఏ ప్రయాణికుడైనా పదేపదే కరోనా నిబంధనలు అతిక్రమిస్తుంటే ఆ వ్యక్తిని నిషేధిత జాబితాలో చేర్చాలని, ఆ విమానయాన సంస్థ ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివరించింది. విమానంలో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ఉండాల్సిందేనని, అది కూడా ముక్కును కవర్ చేసేలా మాస్కు ఉండాలని స్పష్టం చేసింది.

More Telugu News