దేశవ్యాప్త విధానంలో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తున్నాం: సునీల్ దేవధర్

13-03-2021 Sat 14:10
  • ప్లాంటు ఉద్యోగుల బాధ్యతను కేంద్రం చూసుకుంటుంది
  • స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
  • తిరుపతి ఉపఎన్నికపై ప్రకటన వచ్చాక అభ్యర్థిని ప్రకటిస్తాం
Sunil Deodhar comments on Vizag Steel Plant

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తున్నట్టు బీజేపీ నేత సునీల్ దేవధర్ అన్నారు. దేశవ్యాప్త విధానంలో భాగంగానే ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తున్నట్టు తెలిపారు. ప్లాంటు ఉద్యోగుల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. ప్రైవేటీకరణ గురించి ప్లాంటు ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

విజయవాడలో ఈరోజు ఆయన పార్టీ పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో తిరుపతి ఉపఎన్నికపై చర్చించారు. కేంద్రసర్వీసు విశ్రాంత అధికారిని బరిలోకి దించే అంశంపై చర్చలు జరిపారు. నేతలు వారి అభిప్రాయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా సునీల్ దేవధర్ మాట్లాడుతూ, ఉపఎన్నికపై ప్రకటన వచ్చాక అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. అవసరమైనప్పుడల్లా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కొన్ని పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.