Novavax: కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్న కొత్త వ్యాక్సిన్ ‘నోవావ్యాక్స్’.. 96.4 శాతం సమర్థత

Novavax vaccine 96 percent effective against original coronavirus
  • నోవావ్యాక్స్‌ను అభివృద్ధి చేసిన అమెరికన్ సంస్థ
  • యూకే స్ట్రెయిన్‌పై 86.3 శాతం, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌పై 55.4 శాతం ప్రభావశీలత
  • ‘కోవావ్యాక్స్’ పేరుతో వంద కోట్ల డోసుల ఉత్పత్తికి సీరం ఇనిస్టిట్యూట్‌తో ఒప్పందం
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనే టీకాలు మరిన్ని అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పది టీకాలు అందుబాటులో ఉండగా, తాజాగా అమెరికాకు చెందిన ‘నోవావ్యాక్స్’ కరోనాపై సమర్థంగా పనిచేస్తున్నట్టు పరీక్షల్లో తేలింది. ఈ టీకా కరోనా వైరస్‌పై 96.4 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్టు ప్రయోగాల్లో తేలింది. ఒక్క డోసు తీసుకున్న కొన్ని వారాల్లోనే 83.4 శాతం ప్రభావశీలత చూపించినట్టు నోవావ్యాక్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిలిప్ డుబోవ్‌స్కీ తెలిపారు.

బ్రిటన్‌లో 15 వేల మంది, దక్షిణాఫ్రికాలో నాలుగున్నర వేలమందిపైనా ప్రయోగాలు జరిపినట్టు ఫిలిప్ పేర్కొన్నారు. అంతేకాదు, దక్షిణాఫ్రికాలో 245 మంది ఎయిడ్స్ రోగులపైనా దీనిని ప్రయోగించినట్టు చెప్పారు. కరోనా ఒరిజినల్ స్ట్రెయిన్‌పై నోవావ్యాక్స్ టీకా 96.4 శాతం ప్రభావశీలత చూపించగా, యూకే స్ట్రెయిన్‌పై 86.3 శాతం సమర్థత చూపించిందని వివరించారు. అయితే, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన స్ట్రెయిన్‌పై మాత్రం 55.4 శాతం ప్రభావశీలత చూపించినట్టు పేర్కొన్నారు. తాజా ఫలితాలు పూర్తి ఆశాజనకంగా ఉండడంతో టీకా అనుమతి కోసం వివిధ దేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

కాగా, ఇప్పటికే ఆస్ట్రాజెనెకా టీకాను ఉత్పత్తి చేస్తున్న ఇండియాకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో నోవావ్యాక్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ‘కోవావ్యాక్స్’ పేరుతో వంద కోట్ల డోసులను సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసే అవకాశం ఉంది.
Novavax
Corona Virus
UK Strain
South Africa Strain
SII

More Telugu News