క్రికెట్​ వ్యాఖ్యాతను పెళ్లాడనున్న బుమ్రా!

12-03-2021 Fri 14:23
  • సంజనా గణేశన్ తో మార్చి 14–15న వివాహం
  • అతి కొద్ది మంది సమక్షంలో గోవాలో వేడుక
  • కరోనా నిబంధనల ప్రకారం పెళ్లి
Sanjana Ganesan The TV Presenter and Jasprit Bumrah Is Set To Marry
ప్రముఖ క్రీడా వ్యాఖ్యాత సంజనా గణేశన్ ను ఏస్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పెళ్లాడబోతున్నట్టు తెలుస్తోంది. తల్లి, సోదరితో కలిసి బుమ్రా ముంబై నుంచి గోవాకు వెళతాడని, అతి కొద్ది మంది సమక్షంలోనే వివాహ వేడుక జరుగుతుందని సమాచారం. కరోనా నిబంధనల ప్రకారం పెళ్లి వేడుక ఉంటుందని చెబుతున్నారు.

దీనిపై ఇటు సంజన నుంచిగానీ, అటు బుమ్రా నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. అయితే, స్పోర్ట్స్ కీడా అనే ప్రముఖ క్రీడా వెబ్ సైట్.. వారికి శుభాకాంక్షలు చెబుతూ వారిద్దరూ మనువాడబోతున్నట్టు ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో బుమ్రా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన కామెంట్లు వారు పెడుతున్నారు.

  ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన చివరి టెస్టు నుంచి వ్యక్తిగత కారణాలంటూ బుమ్రా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ రెండు టీ20లకూ అతడు అందుబాటులో లేడు. దీంతో పెళ్లి కోసమే అతడు సెలవు పెట్టాడని, టాలీవుడ్ భామ అనుపమ పరమేశ్వరన్ ను పెళ్లాడబోతున్నాడని పుకార్లు పుట్టాయి. దీంతో అనుపమ తల్లి ఆ పుకార్లను కొట్టిపారేశారు. అందులో ఎలాంటి వాస్తవమూ లేదని చెప్పారు.

తాజాగా సంజనను పెళ్లాడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, సంజన స్టార్ స్పోర్ట్స్ లో ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ కు ముందు, మ్యాచ్ అనంతర షోల్లో హోస్ట్ గా వ్యవహరిస్తోంది. కోల్ కతా నైట్ రైడర్స్ కూ హోస్ట్ గా ఉంది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన సంజన.. స్టార్ స్పోర్ట్స్ లో మ్యాచ్ పాయింట్స్, చీకీ సింగిల్స్ వంటి ప్రోగ్రామ్ లు చేస్తోంది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్, దిల్ సే ఇండియా వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.