BJP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ ఓడుతుందనే కేసీఆర్​ ఓటు అడగట్లేదు: బండి సంజయ్​

  • గెలిస్తేనే సీఎం ఓటు అడుగుతారని విమర్శ
  • భైంసా అల్లర్లపై సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్న
  • పసిపాపపై అత్యాచారం జరిగినా పట్టించుకోలేదని ఆరోపణ
  • ఆపదలో ఉన్నప్పుడు సీఎం రాడంటూ మండిపాటు
  • అన్ని వర్గాల్లోనూ టీఆర్ఎస్ పై అసంతృప్తి
KCR Knows that TRS will concede in Graduate MLC Elections Says Bandi Sanjay

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందన్న విషయం సీఎం కేసీఆర్ కు తెలుసని, అందుకే ఆయన ఇప్పటిదాకా ఓటు అడగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అన్ని సర్వేలూ బీజేపీనే గెలుస్తుందని చెబుతున్నాయని, టీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితులున్నాయని, అందుకే టీఆర్ఎస్ కు ఓటేయండంటూ ఆయన అడగలేదన్నారు. గెలిచే పరిస్థితులుంటేనే కేసీఆర్ ఓటు అడుగుతారన్నారు. ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

నడిరోడ్డు మీద అడ్వకేట్ దంపతులను హత్య చేసినా కేసీఆర్ మాట్లాడలేదన్నారు. భైంసాలో జరిగిన అల్లర్లపైనా మాట్లాడలేదన్నారు. చిన్న పాపపై అత్యాచారం చేసినా స్థానిక పోలీసులు కనీసం చికిత్స ఇప్పించే ఏర్పాట్లు చేయలేదని, బీజేపీ నేతలే ఆ పాపకు చికిత్స ఇప్పిస్తున్నారని అన్నారు. బీజేపీ డిమాండ్ చేశాకనే అధికారులు స్పందించారన్నారు. నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భైంసా అల్లర్లు జరిగితే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని, ఆపదలో ఉన్నప్పుడు సీఎం రానే రాడని, అలాంటి సీఎంపై బీజేపీ పోరాడుతుందని అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నామన్నారు.

పీఆర్సీ ఇస్తామంటూ ఎన్నో సందర్భాల్లోనూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ, ఎన్నికల టైంలోనే ఉద్యోగ సంఘాల నేతలతో ఎలా సమావేశం నిర్వహించారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పోరాటంతోనే కనీసం ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చారన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం వరకు కూడా తెలంగాణలో ఉద్యమాలు పరిస్థితి చేసే లేదని, కానీ, ఇప్పుడు బీజేపీ పోరాటాలతో గల్లా పట్టుకుని అడిగే పరిస్థితులు వచ్చాయని అన్నారు. తమ పోరాటాలతోనే ఉద్యోగులు జీతాలు, పింఛన్లను సరిగ్గా వేస్తున్నారన్నారు.

అన్ని వర్గాల్లోనూ టీఆర్ఎస్ పై అసంతృప్తి ఉందన్నారు. దుబ్బాక ఎన్నికలప్పుడు.. బీజేపీ ఎక్కడుందంటూ ప్రశ్నించారని, కానీ, బీజేపీ ఎక్కడుందో ఫలితాలే చెప్పాయన్నారు. అదే రిజల్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ వచ్చిందన్నారు. కేయూ, ఓయూలను కేసీఆర్ నాశనం చేశారని, కానీ, ఆయన అనుచరులకు మాత్రం ప్రైవేటు యూనివర్సిటీలు ఇచ్చారని విమర్శించారు. కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించిందే కేసీఆర్ అన్నారు. ఆయా విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లకు జీతాలివ్వాలని విద్యా సంస్థలను ఎందుకు ఆదేశించట్లేదన్నారు.

ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే కేసీఆర్ హామీలను అమలు చేస్తారని సంజయ్ అన్నారు. బీజేపీ తప్ప ఎవరు గెలిచినా.. మళ్లీ టీఆర్ఎస్ కు కొమ్ము కాస్తారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో భయం మొదలైందన్నారు. అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీ.. అడ్రస్ కోసం వెతుక్కుంటోందన్నారు. రాష్ట్రంలో చట్టం లేదని, పోలీసులు టీఆర్ఎస్ వారికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసే పరిస్థితి లేదన్నారు. ఫిర్యాదు చేసినా వృథానే అన్న భావన ఉందన్నారు. దాని వల్లే అమాయకులూ నేరస్థుల్లా మారుతున్నారని అన్నారు.

More Telugu News