రియల్టర్‌కు కోటి రూపాయలు అప్పిచ్చిన టీచర్.. అడిగితే కారుతో ఢీకొట్టి హతమార్చిన వైనం!
- మహబూబ్‌నగర్‌లో ఘటన
- బైక్‌పై వెళ్తున్న టీచర్‌ను కారుతో వెంబడించి హత్య
- ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం
పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందిన జగదీశ్ అలియాస్ జగన్ పదేళ్ల క్రితం రాజేంద్రనగర్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం నరహరికి ఆయనతో పరిచయం ఏర్పడింది. ఇది ఆర్థిక సంబంధాలకు దారితీసింది. ఈ క్రమంలో జగదీశ్‌కు దాదాపు కోటి రూపాయల వరకు నరహరి రుణంగా ఇచ్చాడు. డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తానన్న సమయం మించిపోవడంతో జగదీశ్‌పై నరహరి ఒత్తిడి పెంచాడు.
డబ్బుల గురించి అడిగేందుకు బుధవారం సాయంత్రం జగదీశ్ ఇంటికి నరహరి వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి 12 గంటల వరకు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో బాలానగర్‌లో తనకు ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని జగదీశ్ హామీ ఇవ్వడంతో శాంతించిన నరహరి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో స్థానిక భగీరథ కాలనీ సమీపంలో ఆయన బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది. కిందపడిన నరహరి మెడను కత్తితో కోసి దారుణంగా హత్య చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢీకొట్టిన కారు వివరాల గురించి ఆరాతీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కారు జగదీశ్‌దేనని తేలింది. నరహరిని కారులో వెంబడించి ఢీకొట్టి హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయన భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.