Maharashtra: మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన!

  • కేంద్రం ఆందోళన చెందుతోందన్న నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్
  • నాగ్ పూర్ లో లాక్ డౌన్ విధిస్తుండటం పరిస్థితిని తెలియజేస్తోంది
  • వైరస్ ను ఎవరూ తేలికగా తీసుకోకూడదు
Centre worried about Maharashtra Corona cases

మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో మహారాష్ట్రలో కొత్త కేసులు మళ్లీ పెరుగుతుండటంపై కేంద్రం తీవ్రంగా ఆందోళన చెందుతోందని నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.

మన దేశం కోవిడ్ రహితంగా ఉండాలంటే... ప్రతి ఒక్కరూ వైరస్ ను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. నాగపూర్ లో మార్చ్ 15 నుంచి 21 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు మహా ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే వీకే పాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నాగ్ పూర్ లో గత 24 గంటల్లో 1800 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

నాగ్ పూర్ లో మళ్లీ లాక్ డౌన్ విధించాలనుకోవడం పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తోందని పాల్ చెప్పారు. మళ్లీ సీరియస్ లాక్ డౌన్ నాటి పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర గురించి చాలా ఆందోళన చెందుతున్నామని చెప్పారు. ప్రస్తుత పరిణామాల నుంచి మనం రెండు విషయాలను నేర్చుకోవాలని... వైరస్ ను తేలికగా తీసుకోకూడదనేది తొలి విషయమని, కరోనా రహితంగా దేశం తయారు కావాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలనేది రెండో విషయమని అన్నారు.

ఈ రోజు మహారాష్ట్రలో 13,659 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 60 శాతం కావడం గమనార్హం. దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న 10 నగరాల్లో 8 మహారాష్ట్రలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. పూణె, నాగ్ పూర్, థానే, ముంబై, అమరావతి, జల్ గావ్, నాశిక్, ఔరంగాబాద్ నగరాలు వాటిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదని చెప్పారు.

More Telugu News