Narendra Modi: ఈరోజు మా అమ్మ వ్యాక్సిన్ వేయించుకున్నారు: మోదీ

  • అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్న మోదీ
  • టీకా వేయించుకునేలా అందర్నీ ప్రోత్సహించాలని పిలుపు
  • ప్రస్తుతం చిన్న కుమారుడి వద్ద ఉంటున్న మోదీ తల్లి
Modis mother takes first dose of Corona vaccine

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. తన తల్లి టీకా తీసుకున్న విషయాన్ని మోదీ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'మా అమ్మ ఈరోజు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారనే విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నా. మీ చుట్టూ ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించాలని అందరినీ కోరుతున్నా' అని మోదీ ట్వీట్ చేశారు. మోదీ మాతృమూర్తి ప్రస్తుతం తన చిన్న కుమారుడు పంకజ్ మోదీ వద్ద ఉంటున్నారు. పంకజ్ మోదీ ప్రస్తుతం గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉంటున్నారు. హీరాబెన్ వయసు 99 ఏళ్లు.

మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45-59 మధ్య వయసులో ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 2.5 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు సమాచారం.  మార్చి 1న మోదీ తొలి వ్యాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు టీకా తీసుకున్నారు.

More Telugu News