Vizag Steel Plant: సమ్మె నోటీసు ఇచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట సమితి

Vizag Steel Plant Porata Samithi serves strike notice
  • విశాఖ స్టీల్ ను ప్రైవేటుపరం చేస్తున్నట్టు స్పష్టం చేసిన కేంద్రం
  • ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన ప్లాంటు ఉద్యోగులు
  • 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని నోటీసులు
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు కూడా కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారులకు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. అయినప్పటికీ కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వైజాగ్ ప్లాంట్ నుంచి 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్టు పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది. దీంతో, ఉక్కు ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది.

ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, పోస్కో కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసును విశాఖ స్టీల్ సీఎండీకి ఇచ్చారు. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సమ్మెకు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్-కార్డు ఉన్న వారందరికీ శాశ్వత ఉపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఈనెల 17న అఖిలపక్ష సంఘాలతో నిరాహార దీక్ష, మార్చి 20న క్రష్ణా గ్రౌండ్స్ లో బహిరంగ సభకు కార్మిక సంఘాలు సిద్ధం అయ్యాయి.
Vizag Steel Plant
Strike Notice
Employees

More Telugu News