Kollu Ravindra: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. అక్రమమన్న చంద్రబాబు!

  • ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ అభియోగాలు
  • మచిలీపట్నంలో ఉద్రిక్తత
  • బీసీలంటే జగన్ కక్ష కట్టారన్న చంద్రబాబు
Former minister Kollu Ravindra arrested Chandrababu Says its Illegal

మునిసిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని,  విధి నిర్వహణలో వున్న ఎస్ఐ పై చేయిచేసుకున్నారన్న ఆరోపణలపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించాంటూ కొల్లు రవీంద్ర నిన్న మచిలీపట్నం జలాల్‌పేటలోని పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వైసీపీ ఏజెంట్లు ఆయనతో వాగ్వివాదానికి దిగారు.

కల్పించుకున్న పోలీసులు రవీంద్రను వెళ్లిపోవాలని సూచించారు. దీంతో రవీంద్ర మండిపడ్డారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తోపులాట కూడా జరిగింది. గెలుపు కోసం పేర్ని నాని విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. ఈ  నేపథ్యంలో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ రవీంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు కొల్లు నివాసానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

మరోపక్క, రవీంద్ర అరెస్ట్‌ను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను లక్ష్యంగా చేసుకుందని, పండుగ రోజు కూడా వారిని సంతోషంగా ఉండనివ్వడం లేదని మండిపడ్డారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గూండాయిజాన్ని ఎదిరించినందుకే బీసీలపై కక్షకట్టారా? అని ప్రశ్నించారు. రవీంద్ర చేసిన నేరమేంటని నిలదీశారు. పోలింగ్ బూతుల్లోకి వెళ్లి దొంగ ఓట్లు వేసుకున్న వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. బీసీల వ్యతిరేకి అయిన జగన్‌కు బీసీలు బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని చంద్రబాబు హెచ్చరించారు.

More Telugu News