dmdk: సీట్ల చిచ్చు.. అన్నాడీఎంకే కూటమి నుంచి తప్పుకున్న విజయకాంత్ పార్టీ

  • త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు
  • క‌నీసం 23 సీట్లు ఇవ్వాల‌న్న డీఎంకేడీకే
  • నో చెప్పిన అన్నాడీఎంకే
  • కుద‌ర‌ని ఏకాభిప్రాయం
dmdk says good bye to aiadmk

త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నాడీఎంకేతో బంధానికి సినీ న‌టుడు విజయకాంత్ పార్టీ  డీఎండీకే టాటా చెప్పింది. ఎన్నిక‌ల్లో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు కొన‌సాగుతుందా? అన్న సందిగ్థ‌త కొన్నాళ్లుగా ఉంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా కోయంబేడులోని డీఎండీకే కార్యాలయంలో ఆ పార్టీ నేత‌లు చ‌ర్చించి ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. అనంత‌రం కూటమి నుంచి వైదొలగుతున్నట్లు విజయకాంత్‌ ప్రకటించారు. ఆ కూటమి నుంచి వైదొలగటం వల్ల తమ పార్టీకి దీపావళి పండుగ వచ్చినట్టుందని ఆ పార్టీ నేత‌లు అన్నారు.

కాగా, త‌మిళ‌నాడు ఎన్న‌క‌ల్లో పోటీ చేయ‌డానికి అన్నాడీఎంకే నుంచి పీఎంకేకు 23 నియోజకవర్గాలను కేటాయించారు. దీంతో త‌మ పార్టీకి అంత‌కంటే ఎక్కువ‌గా 42 నియోజకవర్గాలను కేటాయించాలని డీఎండీకే డిమాండ్ చేసింది. అందుకు అన్నాడీఎంకే ఒప్పుకోలేదు. చివ‌ర‌కు త‌మ‌కు కూడా 23 నియోజకవర్గాల్లోనైనా పోటీకి అవ‌కాశం ఇవ్వాల‌ని డీఎండీకే చెప్పింది.

అయిన‌ప్ప‌టికీ అన్నాడీఎంకే నో చెప్పింది. కేవ‌లం 15 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీకి అవ‌కాశం ఇస్తామ‌ని, అలాగే, భవిష్యత్తులో ఓ రాజ్యసభ సీటు ఇస్తామని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. అనంత‌రం అన్నాడీఎంకేతో డీఎండీకే ప‌లు సార్లు చ‌ర్చ‌లు కొన‌సాగించింది. అయిన‌ప్ప‌టికీ ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డంతో డీఎండీకే అసంతృప్తి వ్య‌క్తం చేసింది. చివ‌ర‌కు ఆ కూట‌మి నుంచి వైదొలిగింది.

More Telugu News