Andhra Pradesh: కడప ఉక్కు పరిశ్రమకు కేంద్ర పర్యావరణ అనుమతులు మంజూరు

  • గతేడాది డిసెంబరులో అనుమతులు కోరిన ఏపీ
  • మూడు నెలల్లోనే అనుమతుల మంజూరు
  • అత్యంత వేగంగా సాధించామన్న ప్రభుత్వం
Kadap Steel Plant got Environmental Clearence

కడపలో నిర్మించతలపెట్టిన ఉక్కు పరిశ్రమకు కేంద్ర పర్యావరణ అనుమతులు లభించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లె, పెద్దనందులూరులో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌ (స్టీల్ ప్లాంట్‌)ను నిర్మించనుండగా గతేడాది డిసెంబరు 20న పర్యావరణ అనుమతులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మూడు నెలల వ్యవధిలోనే పర్యావరణ అనుమతులు లభించాయని, అత్యంత వేగంగా కేంద్రం నుంచి అనుమతులు సాధించినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

కాగా, ప్రభుత్వం నిర్మించతలపెట్టిన స్టీల్‌ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి మూడు మిలియన్ టన్నులు. అంతేకాదు, తొలి విడతలో 84.7 మెగావాట్ల విద్యుదుత్పత్తిని కూడా చేయనున్నారు. ప్రైవేట్ డెవలపర్ అయిన లిబర్టీ స్టీల్ ఇండియాతో కలిసి ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను నిర్మించనుంది. కర్మాగారంలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 484.4 హెక్టార్లలో 12,10,000 మొక్కలు నాటుతారు.

More Telugu News