మళ్లీ పెళ్లాడిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోజోస్ మాజీ భార్య!

09-03-2021 Tue 07:54
  • 2019లో జెఫ్ బోజోస్ నుంచి విడాకులు
  • అపరిమితంగా వచ్చి పడిన సంపద
  • బిలియన్ డాలర్ల విరాళం
MacKenzie Scott married science teacher

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య, ప్రపంచంలోని అత్యంత సంపన్నురాలైన మెకంజీ స్కాట్ మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 50 ఏళ్ల స్కాట్ 53 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన వ్యక్తుల జాబితాలో 22వ స్థానంలో ఉన్నారు. 1993లో బెజోస్‌ను పెళ్లాడిన  స్కాట్ 2019లో విడాకులు తీసుకుంది. ఆమెకు అమెజాన్ నుంచి 38 బిలియన్ డాలర్ల షేర్లు లభించాయి. ఈకామర్స్ సంస్థలో ఇప్పుడామెకు 4 శాతం వాటా కూడా ఉంది.

జెఫ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఇంతకాలం ఒంటరిగా ఉన్న ఆమె మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన ఓ సైన్స్ టీచర్ డాన్ జెవెట్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. తాను స్కాట్‌ను పెళ్లాడినట్టు జెవెట్ స్వయంగా వెల్లడించారు. గొప్ప మానవతావాది అయిన స్కాట్ బిలియన్ల కొద్దీ డాలర్లను విరాళంగా అందిస్తూ వస్తున్నారు.