విజయవాడలో ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు.. రూ. 48.44 లక్షల స్వాధీనం

09-03-2021 Tue 06:30
  • మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో నిల్వచేసినట్టు సమాచారం
  • పట్టుబడిన సొమ్ముకు సరైన పత్రాలు లేవంటున్న పోలీసులు
  • సొమ్ముతో పట్టుబడిన వ్యక్తి వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థికి సమీప బంధువు!
vijayawada police seize huge amount of cash amid municipal elections

విజయవాడలో ఓ ఇంటిపై ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన దాడిలో భారీగా నగదు పట్టుబడింది. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు నిల్వ చేసినట్టు సమాచారం అందింది. అప్రమత్తమైన టాస్క్‌ఫోర్స్, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది 57వ డివిజన్‌లోని న్యూ రాజరాజేశ్వరి పేటకు చెందిన వెల్డర్ కూర్మనాయకులు నివాసంపై దాడిచేశారు. దాడుల్లో మొత్తం 48.44 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన సొమ్ముకు సరైన పత్రాలు లేవని పోలీసులు చెబుతుండగా, ఆ సొమ్మంతా తనదేనని, దానికి సంబంధించి అన్ని పత్రాలు చూపిస్తానని కూర్మనాయకులు చెబుతున్నాడు. పట్టుబడిన సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని ఆదాయపన్ను శాఖకు అందించినట్టు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థికి కూర్మనాయకులు సమీప బంధువని సమాచారం.