రిపబ్లిక్ టీవీలో ఫేక్ న్యూస్ ప్రసారం చేశారు: సజ్జల

08-03-2021 Mon 21:07
  • వైసీపీపై అసత్య కథనాలను ప్రసారం చేస్తున్నారు
  • అర్నాబ్ ఈ జాతికి పట్టిన పీడ
  • వైసీపీలో ఎలాంటి సంక్షోభం లేదు
Republic TV is spreading fake news says Sajjala Ramakrishna Reddy

రిపబ్లిక్ టీవీలో వచ్చే కథనాల్లో ఒక్కటీ నిజం కాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వైసీపీపై అసత్య కథనాలను ప్రజల్లోకి ఆ టీవీ తీసుకెళ్తోందని మండిపడ్డారు. వైసీపీలో ఎలాంటి సంక్షోభం లేదని... అయినా తప్పుడు కథనాలను ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామి ఈ జాతికి పట్టిన పీడ అని దుయ్యబట్టారు. చంద్రబాబు కోసం ఆ టీవీలో కథనాన్ని వండి వార్చారనే అనుమానం కలుగుతోందని చెప్పారు.

నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా ఆ టీవీలో ఫేక్ కథనాలు వచ్చాయని అన్నారు. జగన్ పాప్యులారిటీని తట్టుకోలేకే ఇలాంటి కథనాలు ఇస్తున్నారని చెప్పారు. ప్రజలపై చంద్రబాబు ఆక్రోశం, మహిళా కార్యకర్తపై చేయి చేసుకోవడం వంటి ఎన్నో అంశాలుంటే... వాటిని వదిలేసి, వైసీపీపై ఫేక్ వార్తలను జనాల్లోకి తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ఈ ఫేక్ కథనాల వెనుక ఎవరున్నారనే విషయం అందరికీ తెలుసని చెప్పారు.