దినకరన్ పార్టీతో పొత్తు పెట్టుకున్న అసదుద్దీన్ ఒవైసీ

08-03-2021 Mon 20:46
  • తమిళనాడులో బోణీ కొట్టాలని పట్టుదలగా ఉన్న ఎంఐఎం
  • 234 స్థానాలకు గాను మూడు చోట్ల పోటీ
  • అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ
Owaisis Party Ties Up With TTV Dhinakarans AMMK

ఇప్పటికే పలు రాష్ట్రాల్లోకి చొచ్చుకెళ్లిన ఎంఐఎం పార్టీ తమిళనాడుపై కూడా కన్నేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీటీవీ దినకరన్ కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)తో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ చేతులు కలిపింది. ఏప్రిల్ 6న ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 స్థానాలకు ఎలక్షన్ జరగబోతోంది. పొత్తులో భాగంగా మూడు స్థానాల్లో (వనియంబాడి, క్రిష్ణగిరి, శంకరపురం) ఎంఐఎం పోటీ చేయనుంది.

2016లో ఎంఐఎం తమిళనాడు అధ్యక్షుడు వకీల్ అహ్మద్ ను ఆ పార్టీ బరిలోకి దించింది. ఆ ఎన్నికలో ఆయన 10 వేల ఓట్లు (ఆరు శాతం) సాధించారు. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి గెలవగలిగే 20 స్థానాల పేర్లను ఆ రాష్ట్ర నేతలు ఒవైసీకి అందజేశారు. అయితే మూడు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసే విధంగా పొత్తు కుదిరింది.

ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, పీఎంకే పార్టీలతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంది. డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలు ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి. కమలహాసన్ కు చెందిన ఎంఎన్ఎం పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలనుకున్న దినకరన్ తో ఎంఐఎం చేతులు కలిపింది. అన్నాడీఎంకేను దెబ్బతీయడమే లక్ష్యంగా దినకరన్ అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో... కనీసం 40 స్థానాల్లో ఏఎంఎంకే ప్రభావం చూపిస్తుందని బీజేపీ ఒక అంచనాకు వచ్చింది.

మరోవైపు డీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి తొలుత ఎంఐఎం ప్రయత్నించింది. అయితే డీఎంకే అధినేత స్టాలిన్ నుంచి సరైన స్పందన రాలేదు. ఇప్పటికే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, యనిత నేయ మక్కల్ కట్చి వంటి ముస్లిం పార్టీలతో డీఎంకేకు పొత్తు ఉండటం దీనికి ఒక ప్రధాన కారణం కావడం గమనార్హం.