అమరావతి మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేయడం అవమానకరం: పవన్ కల్యాణ్

08-03-2021 Mon 19:26
  • కనకదుర్గ దర్శనం కోసం బయల్దేరిన రాజధాని మహిళలు
  • ప్రకాశం బ్యారేజి వద్ద అడ్డుకున్న పోలీసులు
  • లాఠీలు ఝుళిపించి, అరెస్టులు చేశారన్న పవన్
  • పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డీజీపీకి విజ్ఞప్తి
Pawan Kalyan condemns police behavior on Amaravati women

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అమరావతి మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శించారు. కనకదుర్గ దర్శనం చేసుకునేందుకు వెళుతున్న మహిళలను విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద అడ్డుకున్న పోలీసులు లాఠీలు ఝుళిపించారని, అరెస్టులు చేశారని పవన్ ఆరోపించారు. తమ పట్ల పోలీసుల దాష్టీకాలను మహిళలు కన్నీటితో వివరిస్తున్నారని వెల్లడించారు.

అమ్మవారి దర్శనం కోసం వెళుతున్న వారిని అడ్డుకోవాలని ఏ నిబంధనలు చెబుతున్నాయని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, మహిళలు గత 15 నెలలుగా పోరాడుతున్నారని, వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన పాలకులు ప్రతి సందర్భంలోనూ అవమానిస్తున్నారని ఆరోపించారు.

శాంతియుతంగా నిరసలు చేస్తున్న వారిని అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రకాశం బ్యారేజి వద్ద మహిళలను ఇబ్బందులకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు విజ్ఞప్తి చేశారు.