అశోక్ గజపతిరాజు నన్ను కొట్టలేదు... మంటలు చెలరేగితే నన్ను కాపాడారు: టీడీపీ మహిళా కార్యకర్త

08-03-2021 Mon 18:18
  • విజయనగరంలో ఘటన
  • ఓ మహిళపై చేయిచేసుకున్నారంటూ అశోక్ పై వార్తలు
  • తీవ్రస్థాయిలో స్పందించిన సంచయిత
  • అయితే అసలు విషయం చెప్పిన మహిళ
  • హారతి పళ్లెంపై పువ్వులు పడి మంటలు చెలరేగాయని వెల్లడి
TDP woman worker said what exactly happened in Vijayanagaram campaign

విజయనగరంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఓ మహిళపై చేయిచేసుకున్నారంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా కనిపించింది. ఈ విషయంలో అశోక్ గజపతిరాజుపై మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి తీవ్ర విమర్శలు కూడా చేశారు. కానీ సాక్షాత్తు అశోక్ గజపతిరాజుతో చెంపదెబ్బ తిన్నట్టుగా ప్రచారం జరిగిన టీడీపీ మహిళా కార్యకర్త చెప్పిన విషయం వేరేలా వుంది.

ప్రచారం సందర్భంగా తాను హారతి పళ్లెం పట్టుకుని నడుస్తున్నానని తెలిపింది. అయితే, ప్రచారంలో భాగంగా చల్లిన పువ్వులు హారతి పళ్లెంపై పడి మంటలు చెలరేగాయని, దాంతో అశోక్ గజపతిరాజు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేశారని ఆ మహిళ వెల్లడించింది. అశోక్ గజపతిరాజు సకాలంలో స్పందించకపోయుంటే తన చీరకు మంటలు అంటుకునేవని తెలిపింది.