ఉమెన్స్ డే సందర్భంగా మహిళా వ్యాపారవేత్తల ఉత్పత్తులు కొనుగోలు చేసిన ప్రధాని మోదీ

08-03-2021 Mon 17:59
  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • అసోం మహిళ నుంచి గమూచా కొనుగోలు చేసిన మోదీ
  • నాగాలాండ్ మహిళల నుంచి శాలువా, పెయింటింగ్ కొనుగోలు
  • మహిళలను ప్రోత్సహించాలన్న మోదీ
PM Modi purchased items made by women entrepreneurs

ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడ చూసినా మహిళల ఔన్నత్యం, వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహం వంటి అంశాలే చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేగాకుండా, మహిళా వ్యాపారవేత్తలు రూపొందించిన పలు ఉత్పత్తులను ఆయన ఆన్ లైన్ లో కొనుగోలు చేశారు.

అసోం మహిళ నుంచి గమూచా (కండువా తరహా వస్త్రం), నాగాలాండ్ మహిళల నుంచి శాలువాను, చేతితో రూపొందించిన గోంద్ పేపర్ పెయింటింగ్ ను కొనుగోలు చేశారు. మహిళల వ్యాపార దక్షతను, సృజనాత్మకతను, భారతదేశ సంస్కృతిని ప్రోత్సహించేందుకే తాను మహిళల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేశానని ప్రధాని మోదీ వెల్లడించారు.

భారత్ ఆత్మనిర్భర్ సాధనలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు అందరం నిబద్ధులమై ఉండాల్సిన సమయం ఇదని పిలుపునిచ్చారు. కాగా, తాను కొనుగోలు చేసిన ఉత్పత్తులను మోదీ సోషల్ మీడియాలో ప్రదర్శించారు. ఆయన ఇవే కాకుండా మధుబని శైలిలో రూపొందించిన స్కార్ఫ్, జనపనారతో తయారుచేసిన ఫైల్ ఫోల్డర్ ను కూడా ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేశారు.