ఐదు కోట్లా? అసలు ఎవరిస్తారు నాకు?: తాప్సీ

08-03-2021 Mon 17:06
  • ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించాము
  • దాడులు ఎందుకు జరిగాయో నాకు అర్థం కావడం లేదు
  • తప్పు చేసినట్టైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే  
Will face punishment if I done wrong says Taapsee Pannu

సినీ నటి తాప్సీ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులపై ఈరోజు ఆమె స్పందిస్తూ... ఇలాంటి వాటికి తాను భయపడనని అన్నారు. ఐటీ దాడులు ఎందుకు జరిగాయో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ఒకవేళ తాను తప్పు చేసినట్టైతే... ఎలాంటి శిక్షను ఎదుర్కోవడానికైనా సిద్ధమేనని తెలిపారు.

సోదాల సందర్భంగా ఐటీ అధికారులకు తాను, తన కుటుంబసభ్యులు పూర్తిగా సహకరించామని చెప్పారు. రూ. 5 కోట్ల రిసీట్ దొరికినట్టు మీడియాలో కథనాలు అల్లారని... తన ఇంట్లో ఆ రిసీట్ దొరికినట్టు ఐటీ అధికారులు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు.

తనకు రూ. 5 కోట్లు ఎవరిస్తారని తానే ఆశ్చర్యానికి గురయ్యానని తాప్సీ విస్మయం వ్యక్తం చేశారు. ప్యారిస్ లో తనకు ఒక బంగళా ఉందంటూ మీడియాలో వరుస కథనాలు వచ్చాయని మండిపడ్డారు. ట్యాక్స్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే... అది కచ్చితంగా బయటపడుతుందని... ఏ విషయాన్నీ తాను దాచలేనని అన్నారు. తనపై ఐటీ దాడులకు కారణమేంటో తనకు తెలియదని... అయితే, అధికారుల సోదాలకు సహకరించక తప్పదని చెప్పారు.