మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి మానసిక స్పందన ఇలా ఉంది: వర్ల రామయ్య

08-03-2021 Mon 16:25
  • నేడు మహిళా దినోత్సవం
  • కనకదుర్గమ్మ దర్శనానికి బయల్దేరిన అమరావతి మహిళలు
  • ప్రకాశం బ్యారేజి వద్ద అడ్డుకున్న పోలీసులు
  • మహిళలపై లాఠీచార్జి చేశారన్న వర్ల రామయ్య
  • సీఎం చెప్పేదొకటి చేసేదొకటని విమర్శలు
Varla Ramaiah hits out CM Jagan mentality after police stoppage Amaravati women at Prakasham Barrage

మహిళా దినోత్సవం సందర్భంగా కనకదుర్గ ఆలయానికి బయల్దేరిన రాజధాని ప్రాంత మహిళలను పోలీసులు ప్రకాశం బ్యారేజి వద్ద అడ్డుకోవడం తెలిసిందే. అయితే మహిళలపై ఈ సందర్భంగా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా దీనిపై స్పందించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అమరావతి మహిళలపై పోలీసుల లాఠీచార్జి, వారి బూట్ల పదక్రందన ముఖ్యమంత్రి మానసిక స్పందనను ప్రతిఫలిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి, చేసేది మరొకటని వ్యాఖ్యానించారు. మహిళలపై ముఖ్యమంత్రి ప్రేమ నీటి బుడగతో సమానం అని వర్ల పేర్కొన్నారు. అమరావతి మహిళల ఆక్రందనలో సీఎం అహంకార అధికార పీఠం కొట్టుకుపోతుందని స్పష్టం చేశారు.