దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా చంద్రబాబు వంటి నాయకుడు ఉండడు: సజ్జల విమర్శలు

08-03-2021 Mon 16:08
  • చంద్రబాబుపై సజ్జల విమర్శనాస్త్రాలు
  • చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని వ్యాఖ్యలు
  • ప్రజలను బెదిరిస్తున్నారన్న సజ్జల  
  • ప్రజలను బానిసల్లా భావిస్తున్నారని విమర్శలు
  • తండ్రీకొడుకులు నీళ్లలో ముంచిన బ్రాయిలర్ కోళ్లలా తయారయ్యారని ఎద్దేవా
Sajjala says there is no leader like Chandrababu in the world

టీడీపీ అధినేత చంద్రబాబులో అసహనం తీవ్రస్థాయికి చేరుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి నాయకుడు ఉండబోరని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటములు, కుప్పం కోట బద్దలు కావడం వంటి పరిణామాలతో చంద్రబాబు నిరాశానిస్పృహలకు లోనవుతున్నారని, గత మూడు రోజులుగా ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుందని అన్నారు.

విజయవాడలోనూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు తన వ్యాఖ్యల పట్ల ఏమాత్రం చింతించకుండా, గుంటూరులో సైతం అదే విధంగా మాట్లాడారని విమర్శించారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే ప్రజలు తనకు బానిసలుగా ఉంటామని ప్రామిసరీ నోటు మీద రాసిచ్చినట్టు భావిస్తున్నారని విమర్శించారు. నేను చెబితే జగన్ ను ఓడించాలి, నన్నే ఎన్నుకోవాలి అనే విధంగా చంద్రబాబు ప్రజలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

చంద్రబాబుకు అధికారం వారసత్వంగా రాలేదన్న సజ్జల... కూటములు ఏర్పాటు చేసుకోవడం ద్వారానే ఇన్నాళ్లు గెలుస్తూ వచ్చారని వివరించారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రజలు తమను గెలిపించలేదన్న అక్కసుతో తిట్టే పని పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యాఖ్యలను టీడీపీ నేతలే అంగీకరించడంలేదని అన్నారు. చంద్రబాబు ప్రజలను బెదిరించాలని ప్రయత్నిస్తుంటే అది కామెడీగా మారిపోతోందని సజ్జల ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా ఆయన నారా లోకేశ్ ను కూడా ప్రస్తావించారు. ఇకపైనా ఈ తండ్రీ కొడుకులు ఇద్దరూ చేసేదేమీ లేదని, ఇద్దరూ నీళ్లలో ముంచిన బ్రాయిలర్ కోళ్లలా ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు.