NIA: ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు ఎన్ఐఏకి అప్పగింత

 NIA has takes up explosives near Mukesh Ambani house
  • అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కలకలం
  • వాహనంలో జిలెటిన్ స్టిక్స్
  • కేసు మళ్లీ నమోదు చేస్తున్న ఎన్ఐఏ
  • వాహనదారు మృతి కేసు విచారించనున్న ఏటీఎస్
  • హిరేన్ ను హత్య చేసి ఉంటారని అనుమానం!
ముంబయిలో వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ నివాసం వద్ద ఇటీవల ఓ వాహనంలో పేలుడు పదార్థాలు ఉండడం తీవ్ర కలకలం రేపింది. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ వాహనం యజమాని హిరేన్ మన్సూఖ్ థానేలో శవమై కనిపించాడు.

ఈ క్రమంలో, అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలు లభ్యమైన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించారు. కేసును స్వీకరించిన అనంతరం ఎన్ఐఏ వర్గాలు స్పందించాయి. కేసు మరోసారి నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నామని దర్యాప్తు సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు.

అయితే, వాహనదారు హిరేన్ మన్సూఖ్ మృతి కేసును మాత్రం ఏటీఎస్ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. మొదట ఇది ఆత్మహత్య కేసు అయ్యుంటుందని భావించిన ఏటీఎస్ పోలీసులు అనంతరం అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. హిరేన్ ను హత్య చేసి, నదిలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఫిబ్రవరి 25న ముంబయిలోని ముఖేశ్ అంబానీ నివాసం యాంటిల్లా వద్ద ఓ స్కార్పియో వాహనం నిలిపి ఉంచడం గుర్తించారు. అందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. ఆ వాహనం ఫిబ్రవరి 18న ఐరోలీ-ములుంద్ బ్రిడ్జి వద్ద చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు.

కాగా, అంబానీ నివాసం వద్ద వాహనం నిలిపి ఉంచిన కేసులో సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు హిరేన్ ను హత్య చేసి ఉంటారన్న వాదనలు బలపడుతున్నాయి. దీనిపై ఏటీఎస్ దర్యాప్తు అధికారి స్పందిస్తూ, ఈ కేసులో హిరేన్ ఒక్కడే సాక్షి అనుకుంటే, ఇప్పుడతడ్ని కూడా కోల్పోయామని వ్యాఖ్యానించారు. 
NIA
Mukesh Ambani
House
Explosives
Mumbai

More Telugu News