ఇన్నాళ్లు సంపాదించిన డబ్బు ఏమైందని చూసుకుంటే అయినవాళ్లే మోసం చేశారని అర్థమైంది: నటుడు రాజేంద్ర ప్రసాద్

08-03-2021 Mon 14:25
  • తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల వెల్లడి
  • కెరీర్ తొలినాళ్లలో నటనలో శిక్షణ పొందానని వివరణ
  • గోల్డ్ మెడల్ అందుకున్నానన్నా రాజేంద్రుడు 
  • రక్తసంబంధీకులు మోసం చేశారన్న కామెడీ కింగ్
Rajendra Prasad reveals he was cheated by kines

తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నటుడు రాజేంద్రప్రసాద్. అద్భుతమైన కెరీర్ ఆయన సొంతం. ఇప్పటికీ తనదైన శైలిలో నవ్వులు పండిస్తూ కాలానుగుణంగా పాత్రలు ఎంపిక చేసుకుంటూ ముందుకుపోతున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో వెనుదిరిగి చూసుకున్న ఆయన ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

ఎన్నో సినిమాలు చేసిన తాను ఎంతో డబ్బు సంపాదించి ఉంటానని, అంత డబ్బు ఏమైందని చూసుకుంటే రక్తసంబంధీకులే మోసం చేశారని అర్థమైందని అన్నారు. జీవితంలో పెద్దగా బాధాకరమైన అంశాలు లేవని, కానీ ఇలా చాలామంది దగ్గర మోసోయానని తెలిపారు. ఇలాంటివి అనేక ఘటనలు ఉన్నాయని అన్నారు.

తాను హాస్యభరిత చిత్రాలే ఎక్కువగా చేయడానికి గల కారణాలను కూడా రాజేంద్రప్రసాద్ వివరించారు. నటనపై ఆసక్తితో మద్రాస్ ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందానని, యాక్టింగ్ కోర్సులో స్వర్ణపతకం అందుకున్నానని వెల్లడించారు. అయితే, తాను సినీ రంగానికి వచ్చిన తొలినాళ్లలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి హేమాహేమీలు ఉన్నారని, నటుడిగా రాణించాలంటే ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావించానని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను చూసిన చార్లీచాప్లిన్ చిత్రం తనకు మార్గదర్శనం చేసిందని వివరించారు. కామెడీ రంగాన్ని ఎంచుకుని, ఆ దిశగానే కృషి చేయాలని నిశ్చయించుకున్నానని తెలిపారు.