టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన షర్మిల

08-03-2021 Mon 14:06
  • మహిళలకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదు
  • ఇద్దరు మహిళలకే మంత్రులుగా అవకాశం 
  • మహిళల హక్కుల కోసం నేను నిలబడతా
YS Sharmila criticises TRS government regarding gender inequality

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచుతున్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్ లో ఆమె వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని అన్నారు. ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు. ఈ గడ్డపై పుట్టిన రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉందని, కానీ, ప్రస్తుత తెలంగాణలో స్త్రీలకు ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అసమానతలు ఉన్నాయని... మహిళలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.

వైయస్ రాజశేఖరెడ్డి హయాంలో ఎందరో మహిళలు మంత్రి పదవులను అలంకరించారని... కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే మంత్రులుగా ఉన్నారని చెప్పారు. ఆ ఇద్దరికీ కూడా ఐదేళ్ల తర్వాతే అవకాశం దొరికిందని అన్నారు. మహిళలు అన్నింటిలో సగం అయినప్పుడు... ఈ అన్యాయం ఎందుకని ప్రశ్నించారు. మహిళల హక్కుల కోసం తాను నిలబడతానని చెప్పారు. తాము చేయబోయే ప్రతి పనిలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు.