Drushyam: 'దృశ్యం 3'కి ఐడియా అడిగిన జీతూ జోసెఫ్.. నెటిజన్ల నుంచి వచ్చిన సమాధానాల్లో కొన్ని ఇవిగో!

  • పలు భాషల్లో హిట్ అయిన 'దృశ్యం'
  • 'దృశ్యం-2'కి కూడా మంచి రెస్పాన్స్ 
  • తెలుగులో రీమేక్ చేస్తున్న వెంకటేశ్
  • మూడో భాగంపై పలు రకాల విశ్లేషణలు
What About Drishyam Third Part Netizens Answers

వెంకటేశ్, మీనాలతో రీమేక్ అయిన మలయాళ చిత్రం 'దృశ్యం' అప్పట్లో మంచి హిట్టయింది. ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయగా, అక్కడా హిట్టయింది. ఇటీవల జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన 'దృశ్యం-2' కూడా ఓటీటీలో మంచి ఆదరణ పొందుతోంది. దీంతో తెలుగులో వెంకటేశ్, మీనాలతో జీతూ దీనిని రీమేక్ చేస్తున్నాడు.

ఇదిలావుండగా, 'దృశ్యం-2' తరువాత మూడవ భాగాన్ని మరింత సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించాలని భావిస్తున్న దర్శకుడు, అందుకు ఐడియాలు చెప్పాలని ఫ్యాన్స్ ను కోరారు. దీనికి వెల్లువలా సమాధానాలు వచ్చాయి. ఇక ఈ మూడవ భాగం ఎలా ఉండాలన్న విషయమై అభిమానుల నుంచి వస్తున్న కొన్ని ఐడియాలను పరిశీలిస్తే...

"జార్జ్ కుట్టి (మోహన్ లాల్) ఓ పెద్ద పొలిటికల్ పార్టీలో చేరుతారు... వరుణ్ కేసును సీబీఐకి అప్పగిస్తారు. అప్పటికే పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదిగిన జార్జ్ ఏం చేస్తారు? ఎలా బయటపడతారు?" ఇది ఓ అభిమాని ఆలోచన. మరొకటి చూస్తే, "జార్జ్ కుట్టి కుమార్తె ఐపీఎస్ అధికారిణిగా ఎదుగుతుంది. ఆమెకే కేసును అప్పగిస్తారు. సహదేవన్ డెడ్ బాడీపై క్లూ ఇస్తాడు. ఇక వరుణ్ ఆషా మొదటి భర్త కుమారుడు అనే విషయం సస్పెన్స్. వాస్తవానికి అతన్ని చంపేది సిద్ధిక్కీ" అని డాక్టర్ ప్రశాంత్ నాయర్ ఓ స్టోరీని అల్లారు.

ఇదే సమయంలో ఈ సినిమాను సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా మారిస్తే... ఆ కథ ఎలాంటిదంటే... "వరుణ్ ప్రభాకర్ దెయ్యమై వస్తాడు. ఆ సమయానికి జార్జ్ కుట్టి ఓ మంత్రగాడిగా తనను తాను ట్రయిన్ చేసుకుంటాడు. అతీంద్రియ శక్తులతో భూతం ఆట కట్టిస్తాడు" అనేలా సినిమా ఉండాలన్నది మరో నెటిజన్ ఆలోచన. "వరుణ్ నిజమైన ఎముకలను గుర్తించి మరోమారు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతారు. అప్పటికి కూడా అతను ఐపీఎస్ అధికారిణి గీత కుమారుడు అని తేలదు. ఫ్లాష్ బ్యాక్ లో గీత బిడ్డను కన్న వెంటనే మారిపోతాడు కాబట్టి" అనేది ఇంకో స్టోరీ.

ఇక అన్ని ఆలోచనల కన్నా విచిత్రంగా, ఆసక్తికరంగా ఉండేలా వచ్చిన సమాధానం ఏంటంటే, ఎన్నో దేశాలు అంగారకుడిపై ఆవాసం కోసం ప్రయత్నాలు సాగిస్తున్న వేళ, ఆక్కడికి వెళ్లిన ఓ టీమ్ కు పాతిపెట్టబడిన మానవ శరీర అవశేషాలు లభిస్తాయి. అవి వరుణ్ వే. వాటిని జార్జ్ కుట్టి అక్కడ ఎలా పాతిపెట్టి వెనక్కు వచ్చాడన్నది చిత్ర కథాంశం... అంటూ ఓ నెటిజన్ తన మదిలోని ఆలోచనను చెప్పాడు. ఇలా సాగుతున్నాయి నెటిజన్ల 'దృశ్యం-3' ఆలోచనలు.

More Telugu News