Parliament: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు... అత్యధికులు గైర్హాజరయ్యే అవకాశం!

  • ఏప్రిల్ 8 వరకూ సమావేశాలు
  • సభ ముందుకు రానున్న కీలక బిల్లులు
  • ఎన్నికల ప్రచారంలో నేతలు
Parliament from today

ఈ సంవత్సరం బడ్జెట్ రెండో విడత సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8 వరకూ సమావేశాలు సాగనుండగా, పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఫైనాన్స్‌ బిల్లుతో పాటు పెన్షన్స్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సవరణ) బిల్లు, విద్యుత్‌ (సవరణ) బిల్లులు ఈ సమావేశాల్లో కీలకం కానున్నాయి. ఇదే సమయంలో క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు కూడా సభ ముందుకు రానుంది.

కాగా, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలు సహా అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై, నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో, ప్రధాన పార్టీల నేతలంతా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో సభకు ఎన్డీయే పెద్దలు సహా, పలు విపక్ష పార్టీల ఎంపీలు సైతం గైర్హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జాతీయ పార్టీల సీనియర్‌ నేతలు, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నాయకులు లోక్ సభ, రాజ్యసభలకు ఏ మాత్రం హాజరవుతారన్న అనుమానాలు నెలకొని ఉన్నాయి. ఈ సంవత్సరం తొలివిడత బడ్జెట్‌ సమావేశాలు జనవరి 29న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ బీజేపీ నేతలైన ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా సహా పలువురు కీలక నేతలు రాష్ట్రాల పర్యటనల్లో బిజీగా ఉన్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు, తృణమూల్ కాంగ్రెస్ నేతలతో పాటు అన్నాడీఎంకే, డీఎంకే, ఎల్డీఎఫ్, యూడీఎఫ్, అసోం గణ పరిషత్ తదితర ప్రాంతీయ పార్టీల నేతలు సైతం ప్రచారం నిమిత్తం క్షేత్ర స్థాయిలో తమ పర్యటనల షెడ్యూల్ చేసుకున్నారు. దీంతో బడ్జెట్ మలివిడత సమావేశాలు తక్కువ మంది సభ్యుల హాజరు మధ్యనే జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News