కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి లైంగిక వేధింపుల కేసులో మలుపు!

08-03-2021 Mon 07:23
  • కేసు ఉపసంహరణకు సామాజిక కార్యకర్త నిర్ణయం
  • లాయర్ ద్వారా పోలీసులకు లేఖ
  • బాధితురాలి పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతోందనే..
Twist in Ramesh Jarkiholi sex CD scandal

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. తన ఫిర్యాదుతో బాధితురాలి పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుండడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని సామాజిక కార్యకర్త దినేశ్ కలహళి నిర్ణయించారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది నిన్న కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి దినేశ్ సంతకం చేసిన లేఖను అందించారు. ఈ నెల 2న రమేశ్ జార్కిహోళిపై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు.  

ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని దినేశ్ నిర్ణయించుకున్నారని, ఈ మేరకు ఆయన సంతకం చేసి ఇచ్చిన లేఖను పోలీసులకు అందించినట్టు న్యాయవాది ఎస్‌కే పాటిల్ తెలిపారు. ఆయన త్వరలోనే పోలీసులను కలిసి అన్ని వివరాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు దినేశ్ లొంగబోరని పేర్కొన్న పాటిల్..  బాధితురాలికి న్యాయం జరిగేలా చూడడమే ఆయన లక్ష్యమన్నారు. సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోందని, అది మరింత తీవ్రంగా మారకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో అవసరమైన సమాచారాన్ని పోలీసులకు అందించేందుకు దినేశ్ సిద్ధంగా ఉన్నారని వివరించారు.  

ఉద్యోగం పేరుతో మాజీ మంత్రి రమేశ్ ఓ మహిళను లైంగికంగా వాడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలోనూ, టీవీ చానళ్లలోనూ ప్రసారమైంది. తన ఫొటోను వాడుకుని ఈ వీడియోను చేశారని తొలుత ఆరోపించిన రమేశ్ జార్కిహోళి ఈ నెల 3న తన పదవికి రాజీనామా చేశారు.