మహిళను నమ్మించి, రూ. 21 లక్షలు నొక్కేసిన కోయ పూజారులు!

08-03-2021 Mon 07:17
  • నిర్మల్ జిల్లా కడెం సమీపంలో ఘటన
  • తొలుత రాగి బిందెను చూపి నమ్మించిన మోసగాళ్లు
  • పోలీసులను ఆశ్రయించిన మహిళ
Fake Preasts Cheats Women in Nirmal Dist

ఇంట్లో కోట్ల విలువైన గుప్త నిధి దాగున్నదంటూ, ఓ అమాయక మహిళను నమ్మించిన కొందరు కోయ పూజారులు, ఆమె నుంచి రూ. 21 లక్షలు నొక్కేశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరులో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇటీవల గ్రామానికి వచ్చిన ఓ కోయ పూజారి, ఓ మహిళను చూసి, వాళ్ల ఇంట్లో రెండు మీటర్ల లోతున నిధులున్నాయని, తొమ్మిది రోజుల్లో బయటకు తీస్తానని నమ్మబలికాడు.

అతని మాటలు నమ్మిన ఆమె తొలుత రూ. 5 లక్షలు చెల్లించింది. ఈలోగా, నిధి చుట్టూ పెద్ద శక్తులు ఉన్నాయని నమ్మబలికిన ఆయన, మరో కోయ పూజారిని పిలిపించాడు. ఆపై ఇంకో మూడు లక్షలు తీసుకున్నారు. కాస్తంత మాయ చేసి, ఓ రాగి బిందెను బయటకు తీయడంతో ఆమె పూర్తిగా నమ్మింది.

ఇక మొత్తం నిధి బయటకు రావాలంటే, కేరళ నుంచి పెద్ద స్వామిని రప్పించాలని చెప్పడంతో నిజమేననుకుని మరింత మొత్తం చెల్లించింది. ఇలా మొత్తం రూ. 21 లక్షలు నొక్కేసిన కోయ పూజారి ఆపై మాయం అయ్యాడు. తాను దారుణంగా మోసపోయానని గమనించిన ఆమె, బావురుమంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ప్రారంభించారు.