20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే కేసీఆర్ కు తోమాల సేవ చేస్తా... నిరూపించకపోతే బడితెపూజ చేస్తా: బండి సంజయ్

07-03-2021 Sun 19:19
  • కేటీఆర్, కేసీఆర్ లపై బండి సంజయ్ ధ్వజం
  • కేంద్రం నిధులు లేనిదే ఏ పథకం లేదని వెల్లడి
  • అన్నీ ఇస్తే వీళ్లు పొడిచేది ఏంటని వ్యాఖ్యలు
  • ఎమ్మెల్సీ ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు లేదని స్పష్టీకరణ
  • టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలన్న సంజయ్
 Bandi Sanjay fires on KCR and KTR

తెలంగాణ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన మాటల్లో పదును పెంచారు. కేంద్రం తమకు నిధులు ఇవ్వడంలేదంటూ బీజేపీపై విమర్శలు చేసిన కేటీఆర్ కు అదే స్థాయిలో బదులిచ్చారు. కేంద్రం ఏమీ ఇవ్వడంలేదని కేటీఆర్ అంటున్నారని, అన్నీ ఇచ్చాక వీళ్లు పొడిచేది ఏమిటని అన్నారు. కేంద్రం నిధులు లేనిదే ఏ పథకం ముందుకు కదిలే పరిస్థితి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఇక, 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే కేసీఆర్ కు తోమాల సేవ చేస్తానని, నిరూపించకుంటే బడితె పూజ చేస్తానని పేర్కొన్నారు. ఎన్టీఆర్, పీవీ ఘాట్ లను కూల్చుతామని ఒవైసీ అంటే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని అన్నారు. ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. అలాంటి పార్టీకి ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు. భారత్ బయోటెక్ సందర్శనకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు వస్తే కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు.