కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీకి ఓటేసే పరిస్థితి లేదు: హరీశ్ రావు

07-03-2021 Sun 19:04
  • బీజేపీపై ధ్వజమెత్తిన హరీశ్ రావు
  • ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారని ఆరోపణ
  • ప్రైవేటీకరణపై మోదీ బహిరంగంగానే చెబుతున్నారని వెల్లడి
  • బీజేపీకి ఎందుకు ఓటేయాలని ఆగ్రహం
Harish Rao take a dig at BJP on privatisation

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉపాధి పోతుందని ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులెవరూ బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు.

హైదరాబాదులోనూ బీహెచ్ఈఎల్, బీడీఎల్, మిథాని, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నివసిస్తున్నారని, వారెవరూ ఇప్పుడు బీజేపీకి ఓటు వేయరని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తామని, ప్రైవేటీకరణ చేస్తామని మోదీ బహిరంగంగా చెబుతుంటే బీజేపీకి ఎందుకు ఓటేయాలని హరీశ్ రావు అన్నారు.

ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తుంటే అక్కడివాళ్లు రోడ్డెక్కారని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ లో 50 వేల మందిని తొలగించారని, ఎల్ఐసీని ప్రైవేటు పరం చేస్తున్నారని వివరించారు. రైల్వేను ప్రైవేటు పరం చేసే ప్రక్రియ ప్రారంభమైందని, ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ బీజేపీకి ఓటు వేయాలని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తున్నట్టు రేపు బీహెచ్ఈల్, బీడీఎల్ లను కూడా అమ్మేస్తారని అన్నారు. బీజేపీ అంటే ఆకాశంలో మబ్బులు చూపించి దాహం తీర్చుకోమని చెప్పే పార్టీ అని ప్రజలు భావిస్తున్నారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.