ప్రజల కోసమే కొన్ని భరిస్తున్నాను... ఈ వైసీపీకి భయపడి కాదు: చంద్రబాబు

07-03-2021 Sun 18:06
  • విజయవాడలో చంద్రబాబు నగరపాలక ఎన్నికల ప్రచారం
  • వైసీపీ నేతల రౌడీయిజం తన వద్ద సాగదని వార్నింగ్
  • పంచాయతీ మంత్రి ఓ పనికిమాలిన మంత్రి అని వ్యాఖ్యలు
  • తానో పెద్ద రౌడీ అనుకుంటున్నాడని విమర్శలు
  • తాను రౌడీలకు రౌడీనన్న చంద్రబాబు
Chandrababu campaigns in Vijayawada Gandhi Hill area

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సాయంత్రం విజయవాడ నగరపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గాంధీ హిల్ ప్రాంతంలో టీడీపీ శ్రేణులు నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. వైసీపీ నేతల రౌడీయిజం తన వద్ద సాగదని స్పష్టం చేశారు. అయితే ప్రజల కోసమే కొన్ని భరిస్తున్నానని, ఈ వైసీపీకి భయపడి కాదని స్పష్టం చేశారు. పేకాట మంత్రికి, అవినీతి మంత్రికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు.

"రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఓ పనికిమాలిన మంత్రి. తానో పెద్ద రౌడీ అనుకుంటున్నాడు. నేను రౌడీలకు రౌడీని. గుండెల్లో నిద్రపోతా. ప్రజలు తిరగబడ్డ రోజున నీలాంటి రౌడీలు పారిపోతారు. సిగ్గు లేకుండా దౌర్జన్యాలు చేసి గెలవాలనుకుంటున్నారు" అంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుని ప్రజల ఓటు హక్కును సమాధి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచక, దోపిడీ పాలనకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఇక, రాజధానిగా అమరావతి ఆమోదయోగ్యమో, కాదో ఓటు ద్వారా చెప్పాలని అన్నారు. వైసీపీకి ఓటు వేస్తే 3 రాజధానులకు మద్దతు ఇచ్చినట్టు అవుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రులు గర్వించే రాజధాని అమరావతిని నిర్మిస్తుంటే... జగన్ వచ్చి రాజధానిని ముక్కలుగా చేసి అస్తవ్యస్తం చేశాడని ఆరోపించారు.