రావాలి ప్రభాకర్, కావాలి ప్రభాకర్ అంటున్నారు... వారి ఆదరణ చూస్తే భయమేస్తోంది: జేసీ ప్రభాకర్ రెడ్డి

07-03-2021 Sun 17:44
  • నాడు రావాలి జగన్ అన్నారని వెల్లడి
  • ఇప్పుడు గాలి మారిందన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
  • తాడిపత్రిలో ప్రజాభిమానం తమకే ఉందని స్పష్టీకరణ
  • మున్సిపల్ ఎన్నికల్లో తామే నెగ్గుతామని ధీమా
JC Prabhakar Reddy opines on TDP chances in Tadipatri municipal elections

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాడు రావాలి జగన్, కావాలి జగన్ అన్నారని, ఇప్పుడు గాలి మారిందని తెలిపారు. ప్రజల్లో మార్పు వచ్చిందని... తాడిపత్రిలో రావాలి ప్రభాకర్, కావాలి ప్రభాకర్ అంటున్నారని వెల్లడించారు. అయితే ప్రజల్లో ఈస్థాయిలో తమపై ఆదరణ చూస్తుంటే భయమేస్తోందని అన్నారు. 1952 నుంచి ఇక్కడ నిలిచామంటే అది ప్రజల్లో తమపై ఉన్న అభిమానమేనని, తమకింతటి పేరు రావడానికి ఈ ఊరే కారణమని స్పష్టం చేశారు.

గత రెండున్నరేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను తనతో పంచుకుంటున్నారని జేసీ వివరించారు. రాష్ట్రంలో టీడీపీకి అత్యధిక పంచాయతీ స్థానాలు వచ్చింది తన నియోజకవర్గంలోనే అని వెల్లడించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కచ్చితంగా తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు.