చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి పేర్ని నాని
- చంద్రబాబుకు కులపిచ్చి పట్టుకుందన్న పేర్ని నాని
- ప్రజలే బడితె పూజ చేస్తారని వెల్లడి
- చంద్రబాబులా జగన్ కు కులపిచ్చి లేదని స్పష్టీకరణ
- పవన్ సొల్లు మాటలు చెప్పడం ఆపాలని వ్యాఖ్యలు
- ఎన్నికలంటే పవన్ కు సంపాదనలా మారిందని విమర్శలు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కుల పిచ్చి పట్టుకుందని, చంద్రబాబుకు ప్రజలే బడితె పూజ చేస్తారని అన్నారు. చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన వారినే మేయర్ అభ్యర్థులుగా ప్రకటించారని విమర్శించారు. అయితే సీఎం జగన్ కు చంద్రబాబులా కులపిచ్చి లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. అమరావతే కాదు జగన్ పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్నామని తెలిపారు.
రాజకీయాలకు డబ్బు అంటించిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబుకు చేతనైంది మోసం చేయడమేనని, అందుకే ప్రజలు 2019 ఎన్నికల్లో ఆయనను వదిలించుకున్నారని ఎద్దేవా చేశారు. దోచుకోవడం, దాచుకోవడంపైనే చంద్రబాబుకు మక్కువ అని, చంద్రబాబుకు ఏ ఊరి మీద, ఎవరిపైనా ప్రేమ ఉండదని అన్నారు. చివరికి మామ, బావమరుదులు, తోడల్లుడుపైనా ప్రేమ ఉండదని విమర్శించారు.
ఇక, స్టీల్ ప్లాంట్ అంశంలో తమను తప్పుబడుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ పైనా పేర్ని నాని స్పందించారు. వైజాగ్ ఉక్కు పరిశ్రమ అంశంలో పవన్ ఢిల్లీ వెళ్లి ఏంచేశారని ప్రశ్నించారు. బీజేపీ చంకనెక్కిన పవన్ సొల్లు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు అంటే పవన్ కల్యాణ్ కు సంపాదనకు అవకాశంలా మారిందని విమర్శించారు. పవన్ ఇచ్చే బీ ఫారంలు మరొక పార్టీ చేతిలో ఉంటాయని, పవన్ ఇకనైనా ప్రజలను మోసగించడం మానుకోవాలని హితవు పలికారు.






























