బెంగాల్ ప్రజల సోనార్ బంగ్లా కలను బీజేపీ సాకారం చేస్తుంది: మోదీ

07-03-2021 Sun 15:35
  • పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • ఇటీవల షెడ్యూల్ విడుదల
  • బెంగాల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని
  • కోల్ కతా బ్రిగేడ్ మైదానంలో భారీ సభ
  • బెంగాల్ అభివృద్ధికి హామీ
Narendra Modi attends election rally in West Bengal

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి రాష్ట్రానికి వచ్చారు. కోల్ కతా బ్రిగేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బెంగాలీలు శాంతిని, సువర్ణ బెంగాల్ (సోనార్ బంగ్లా)ను కోరుకుంటున్నారని వెల్లడించారు. బెంగాల్ ప్రజల సోనార్ బంగ్లా కలను బీజేపీ సాకారం చేస్తుందని హామీ ఇచ్చారు. బెంగాల్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ సంస్కృతి, కళల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఓవైపు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తీరును నిరసించారు.

అటు,  బీజేపీలోకి ప్రముఖుల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నట దిగ్గజం మిథున్ చక్రవర్తి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. మిథున్ చక్రవర్తి గతంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.

కాగా, పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు 8 విడతల్లో జరగనున్నాయి. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు పోలింగ్ పలు దఫాలు నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు.