బీజేపీలో చేరిన తృణమూల్​ నేత, బెంగాలీ స్టార్​ మిథున్​ చక్రవర్తి

07-03-2021 Sun 13:29
  • కైలాష్ విజయవర్గీయ సమక్షంలో చేరిక
  • ప్రధాని సభా వేదికపైనే కండువా కప్పుకున్న హీరో
  • పార్టీకి మరింత బలమంటున్న నేతలు
Mithun Chakrabarthi officially joins BJP

బెంగాల్ లో సినీ నటుల పార్టీ చేరికలు జోరందుకున్నాయి. పార్టీలు పోటాపోటీగా నటులను చేర్చుకుంటున్నాయి. తాజాగా అలనాటి ప్రముఖ బెంగాలీ హీరో మిథున్ చక్రవరి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఆ పార్టీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, పార్టీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈరోజు కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఆ సభ కోసం పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. సభకు మిథున్ చక్రవర్తి కూడా వచ్చారు. ఆ సభా వేదికపైనే కైలాష్ విజయవర్గీయ ఆయనకు పార్టీ కండువా కప్పారు. అయితే, ప్రధాని సభకు మిథున్ చక్రవర్తి హాజరవుతారని కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. ఆయన బీజేపీలో చేరడం ఖాయమన్న ఊహాగానాలూ వినిపించాయి. వాటన్నింటిని ఆయన నిజం చేశారు. కొన్నేళ్ల పాటు తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగిన ఆయన.. బీజేపీలో చేరడం పార్టీకి మరింత బలాన్నిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.