కశ్మీర్లో 155 మంది రోహింగ్యాలు జైలుకు తరలింపు

07-03-2021 Sun 12:42
  • అక్కడే ఆశ్రయం కల్పించిన పోలీసులు
  • జమ్మూలో గుర్తింపు పత్రాల పరిశీలన
  • స్టేడియంకు తీసుకెళ్లి వారి వివరాల సేకరణ
  • వారి దేశానికి తిప్పి పంపించే ఏర్పాట్లు
155 Rohingyas sent to holding centre in Jammu as police begins verification

మయన్మార్ నుంచి పారిపోయి వచ్చి భారత్ లో అక్రమంగా ఉంటున్న 155 మంది రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని జైలుకు పంపించి అక్కడే ఆశ్రయం కల్పించారు. వారి సొంత దేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

శనివారం జమ్మూలోని వివిధ కాలనీల్లోని రోహింగ్యాలను పోలీసులు మౌలానా ఆజాద్ స్టేడియంకు తరలించి.. వారి గుర్తింపు పత్రాలను పరిశీలించారు. మీడియాను అనుమతించలేదు. సరైన పత్రాలు చూపించని ఆ రోహింగ్యాలను సాయంత్రం కథువా జిల్లాలోని హీరానగర్ సబ్ జైలుకు తరలించారు.

కాగా, పోలీసుల చర్యను బీజేపీ నేతలు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు ప్రశంసించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017 నాటికి రోహింగ్యాలు, బంగ్లాదేశీలు సహా 13,700 మంది విదేశీయులు జమ్మూ కశ్మీర్ లో ఉంటున్నారు. 2008 నుంచి 2016 మధ్య వారి సంఖ్య 6 వేలకుపైగా పెరిగింది.

ఇక, 2017లో 5,700 మంది రోహింగ్యాలు, 322 మంది ఇతర విదేశీయులు జమ్మూకశ్మీర్ లో ఉన్నట్టు నాటి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అసెంబ్లీకి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రోహింగ్యాలు ఎక్కువగా జమ్మూ, సాంబా జిల్లాల్లోనే ఉన్నట్టు నాడు చెప్పారు.