పాక్​ లో హిందూ కుటుంబం దారుణ హత్య

07-03-2021 Sun 12:22
  • ఐదుగురిని నరికి చంపిన దుండగులు
  • పంజాబ్ ప్రావిన్స్లోని రహీంయార్ ఖాన్ సిటీలో ఘటన
  • బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న హిందువులు
  • వేగంగా దర్యాప్తు చేయాలన్న ఆ రాష్ట్ర సీఎం
Five members of Hindu family in Pakistan killed with knives and axe locals in shock

పాకిస్థాన్ లో మరో హిందూ కుటుంబంపై దాడి జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతులు కోసి, గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటన పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న రహీం యార్ ఖాన్ సిటీలోని అబుధాబి కాలనీలో జరిగింది.

దీంతో ఆ ప్రాంతంలోని హిందువులంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, గొడ్డలిని ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హత్యకు గురైనవారు రామ్ చంద్ అనే వ్యక్తి కుటుంబసభ్యులు అని ఆ ప్రాంతానికి చెందిన స్వచ్ఛంద కార్యకర్త బీర్బల్ దాస్ చెప్పారు. అతడు మేఘ్వాల్ హిందూ అని, టైలరింగ్ పని చేస్తున్నాడని తెలిపారు. ఎవరి జోలికీ అతడు వెళ్లడని, శాంతపరుడని అన్నారు. అతడి కుటుంబ హత్య అందరినీ షాక్ కు గురిచేసిందన్నారు.

కాగా, ఘటనపై పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి సర్దార్ ఉస్మాన్ బజ్దార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసును వేగంగా దర్యాప్తు చేయాలని, నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.