ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు సమస్యలు పట్టించుకోకుంటే వారి తలలు పగులగొట్టండి: కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​

07-03-2021 Sun 11:23
  • బెగూసరాయ్ ప్రజలకు సూచన
  • అప్పటికీ మార్పు లేకుంటే తానొస్తానని కామెంట్
  • వారంతా ప్రజలకు సేవ చేయాల్సిందేనని స్పష్టీకరణ
Thrash MPs MLAs and Officials with bamboo sticks if they dont pay heed to your grievances Min Giriraj Singh asks begusarai people

ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ప్రభుత్వాధికారులు ఎవరైనా ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే వెదురు కర్రలతో చితక్కొట్టాలని బెగూసరాయ్ ప్రజలకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. శనివారం బీహార్ లోని బెగూసరాయ్ లో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాధికారులు సమస్యలను అస్సలు పట్టించుకోవట్లేదంటూ ప్రజల నుంచి తనకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయన్నారు.

‘‘ఇంత చిన్న విషయాలకూ నా దాకా రావడం దేనికి? ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ప్రభుత్వాధికారులంతా ప్రజల కోసం పనిచేయాల్సిందే. ఎవరైనా సరే ప్రజల సమస్యలను పట్టించుకోవల్సిందే. అలా కాని పక్షంలో వెదురు కర్రలు తీసుకొని చితక బాదండి. వారి తలలు పగుల గొట్టండి’’ అంటూ వ్యాఖ్యానించారు. అప్పటికీ వారు మాట వినకపోతే అప్పుడు తానొస్తానని, ప్రజల వెనక నిలబడతానని ఆయన అన్నారు.